లోక్‌సభలో యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని, పెల్లెట్ గన్స్ (రబ్బరు బుల్లెట్లు) ప్రయోగించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆయుధాలు ప్రయోగించడానికి వారేమైనా ఉగ్రవాదులా అని ఆమె కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.
దేశ యువత తమ ప్రజాస్వామ్య హక్కులను శాంతియుతంగా వినియోగించుకుంటుంటే, వారిపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనను అణచివేయాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
పేపర్ లీక్‌ల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.








