వాటర్ ట్యాంకులోకి దిగి మురికిని తొలగించడం శ్రమతో కూడుకున్న పని. దీనివల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా, నీరు కూడా ఎక్కువగా వృథా అవుతుంది. అయితే, ఇంట్లో దొరికే వస్తువులతోనే ట్యాంకులోకి దిగకుండా అడుగున ఉన్న ఇసుక, మట్టిని సులభంగా తొలగించవచ్చు.

ఈ పద్ధతి కోసం ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ పైపు, పొడవైన కర్ర లేదా పైపు, కత్తెర, బ్లేడ్, అడ్హెసివ్ టేప్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా ప్లాస్టిక్ బాటిల్ అడుగు భాగాన్ని కట్ చేసి, అక్కడక్కడ చిన్న రంధ్రాలు లేదా గాట్లు పెట్టాలి. బాటిల్ మూత భాగానికి ప్లాస్టిక్ పైపును అమర్చి టేప్‌తో గట్టిగా అతికించాలి. బాటిల్‌ను ట్యాంక్ అడుగు వరకు తీసుకెళ్లడానికి ఒక పొడవైన కర్రను దానికి జత చేయాలి.

పైపులో నీటిని నింపి, దాని రెండో చివరను ట్యాంక్ కంటే తక్కువ ఎత్తులో ఉంచితే సైఫన్ పద్ధతిలో నీరు బయటకు రావడం మొదలవుతుంది. ఇప్పుడు బాటిల్‌ను ట్యాంక్ అడుగున ఉన్న మురికిపై ఉంచితే, ఆ మట్టి, ఇసుక నీటితో పాటు పైపు ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఈ పద్ధతి ద్వారా ట్యాంకులోని నీటిని పూర్తిగా ఖాళీ చేయకుండానే కేవలం అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను మాత్రమే తొలగించవచ్చు.