భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రభావంతో నర్సాపురం వశిష్ఠ గోదావరికి వరద నీరు పోటెత్తడంతో నది ఎరుపెక్కి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నర్సాపురం ఆర్డీఓ దాసి రాజు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలను అప్రమత్తం చేశారు.
వరద ఉధృతి దృష్ట్యా ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నర్సాపురం మండలాల్లోని నదీ తీర గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నర్సాపురం, దొడ్డిపట్ల ఫెర్రీ రేవుల వద్ద పడవ రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. మాధవాయపాలెం, దొడ్డిపట్ల రేవుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, ఎటువంటి అనధికారిక పడవ ప్రయాణాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.
రానున్న రెండు రోజులు చాలా కీలకమని, మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని ఆర్డీఓ తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఆదేశించారు. నదీ తీర ప్రాంతాల్లో టామ్ టామ్ ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది నిరంతరం గస్తీ తిరుగుతూ ఏటిగట్టు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
వరద తీవ్రత పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలో గస్తీ తిరుగుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించారు.







