శనివారం ఓదెల మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో పూర్తి చేసిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను విప్ ప్రశంసించారు. విద్యాశాఖలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడంపై కలెక్టర్‌ను అభినందించారు.

రానున్న రోజుల్లో సూపర్ ఎల్నినో పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున, రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు దూరంగా ఉండాలని విజయరమణరావు హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలను మాత్రమే సాగు చేయాలని, లేనిపక్షంలో నీటి కొరతతో పంటలను కాపాడుకోవడం కష్టమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత సీజన్‌లోనే ముందస్తు ప్రణాళికతో చెరువులను నింపడం వల్లే ప్రస్తుతం మండలాల్లో నీరు అందుబాటులో ఉందని ఆయన గుర్తు చేశారు.

జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూ పునఃసర్వే గురించి కలెక్టర్ కోయ శ్రీహర్ష వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా, జిల్లాలో ఇప్పటికే 23 గ్రామాల్లో సర్వే ప్రారంభించామని తెలిపారు. సర్వే పూర్తయ్యాక రైతుల అభ్యంతరాలను పరిశీలించి, సవరణలు చేసిన తర్వాతే తుది వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తామని, దీనివల్ల 99 శాతం భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.

ఓదెలలో త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణాన్ని చేపడతామని విప్ విజయరమణరావు వెల్లడించారు. ఇప్పటికే పొత్కపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని, జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములు, తహసీల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.