ఒక యువకుడు ప్రవక్త వద్దకు వచ్చి వ్యభిచారం చేయడానికి అనుమతి కోరాడు. ఆ సమయంలో ఆయన అతడిని మందలించకుండా, ప్రేమగా దగ్గరకు తీసుకుని కూర్చోబెట్టుకున్నారు. నీ తల్లికో, చెల్లికో ఇతరులు ఇలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని ఆయన అడిగిన ఒక్క ప్రశ్న ఆ యువకుడి మనసును మార్చివేసింది.
మరో సందర్భంలో, మసీదు పవిత్రత తెలియక ఒక పల్లెటూరి వ్యక్తి లోపల మూత్రవిసర్జన చేశాడు. చుట్టూ ఉన్నవారు ఆగ్రహంతో కర్రలు ఎత్తగా, ప్రవక్త వారిని ఆపి ఆ వ్యక్తిని పని పూర్తి చేయనివ్వమని చెప్పారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రేమగా విషయం వివరించి, స్వయంగా నీళ్లతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించారు.
ఖురాన్ ప్రకారం, మనిషికి జ్ఞానాన్ని, విచక్షణను, కొత్త విషయాలను నేర్పించే గురువు స్థానం చాలా గొప్పది. తనకు ఒక్క అక్షరం నేర్పిన వారికి కూడా జీవితాంతం బానిసగా ఉంటానని హజ్రత్ అలీ చెప్పిన మాటలు గురువు పట్ల ఉండాల్సిన గౌరవాన్ని తెలియజేస్తాయి.
గురువు అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలను అప్పజెప్పే టేప్ రికార్డర్ కాదు. మనిషిలోని అజ్ఞానాన్ని తుడిచిపెట్టి, నిద్రపోతున్న మంచితనాన్ని మేల్కొలిపే అద్భుతమైన శిల్పి అని ప్రవక్త నిరూపించారు.
మనం చనిపోయిన తర్వాత కూడా మనతో వచ్చేవి మనం చేసిన మంచి పనులు, గురువు నేర్పిన జ్ఞానం మాత్రమే. దీన్నే 'సదఖాయె జారియా' అని, అంటే తరగని పుణ్యమని పిలుస్తారు. గురువుల ద్వారా పొందిన ఈ జ్ఞానాన్ని, వారు చూపిన బాటను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.








