జపాన్‌కు చెందిన సుకూబా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త షోహీ ఒకమోటో నేతృత్వంలోని బృందం, వృద్ధుల ఆయుష్షుపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం వారు ‘జపనీస్ ఏజింగ్ అండ్ హెల్త్ డైనమిక్స్ స్టడీ’ (వృద్ధుల ఆరోగ్యం, జీవనశైలిపై జరిపే పరిశోధన) డేటాను విశ్లేషించారు. 60 ఏళ్లు, ఆపై వయసున్న 2,447 మందిని తాము ఎంతకాలం జీవిస్తారని భావిస్తున్నారో శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకున్నారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 393 మంది తమ ఆయుష్షు గురించి ఏమీ చెప్పలేకపోయారు. మిగిలిన వారు 63 నుంచి 120 ఏళ్ల మధ్య వయసు వరకు జీవిస్తామని అంచనా వేశారు. వీరిలో ఎక్కువ మంది 80 ఏళ్లను తమ ఆయుష్షుగా పేర్కొన్నారు. 1996 నాటి జపాన్ సగటు ఆయుర్దాయం కూడా దాదాపు ఇదే వయసులో ఉండటంతో, ప్రజలు ఆ సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ సర్వే జరిగిన 28 ఏళ్ల తర్వాత, అంటే 2024 నాటికి మరణించిన 1,514 మంది వివరాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. తాము ఎక్కువ కాలం జీవిస్తామని నమ్మిన వారు, అనుకున్నట్లే ఎక్కువ కాలం జీవించినట్లు డేటా ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా మహిళలు, ఉన్నత విద్యావంతులు తమ అంచనాలను మించి జీవించినట్లు గుర్తించారు.

అయితే, తాము ఎక్కువ కాలం బతకలేమని భావించిన వారిలో కూడా సుమారు 59 శాతం మంది, తమ అంచనా కంటే ఎక్కువ ఏళ్లే జీవించినట్లు తేలింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, కుటుంబ నేపథ్యం ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తామని నమ్మే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కేవలం సానుకూల దృక్పథం వల్లే ఆయుష్షు పెరిగిందా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు. ఇది కేవలం పరిశీలనాత్మక డేటా మాత్రమేనని, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని వారు స్పష్టం చేశారు.