వందేమాతరం గేయంలోని ఆరు చరణాలు పాడాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, ఈ చట్టాన్ని తాము పాటించబోమని, 1937లో తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు చరణాలు మాత్రమే పాడతామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నాయకులు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పేర్కొంది. అప్పటి నుంచి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నామని ఆ పార్టీ తెలిపింది.
కాంగ్రెస్ నిర్ణయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ చర్య దేశ వ్యతిరేకమని పేర్కొంటూ, దీనిపై అందరూ గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.
అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. జాతీయ గేయాన్ని అగౌరవపరచడం అంటే స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అవమానించడమేనని వారు వ్యాఖ్యానించారు.
బీజేపీ విమర్శలను కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా తిప్పికొట్టారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని విమర్శించడం అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాస్ చంద్రబోస్ వంటి జాతీయ నాయకులను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు.







