నాగార్జున సాగర్ ఒడ్డున వరుణ యాగానికి సర్వం సిద్ధం
మహాపూర్ణాహుతిలో పాల్గొననున్న సిఎం రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్‌నినోను ఎదుర్కొని ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ‘మహా వరుణ యాగం’ కోసం సర్వం సన్నద్ధమైంది. సోమవారం (10న) తెల్లవారుజాము నుంచే నాగార్జున సాగర్ తీరాన గల విజయ విహార్ ప్రాంగణంలో యాగం ఆరంభంకానుంది. మహా వరుణ యాగానికి 11 హోమ కుండాలు సిద్ధం చేశారు. 108 మంది రుత్వికుల వేద మంత్రాల మధ్య మహా వైదిక క్రతువు జరుగుతుంది. మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులూ హాజరుకానున్నారు. వర్షాలు కురవకపోవడంతో ప్రజలు ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘మహా వరుణ యాగం’ సంకల్పించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ బాధ్యతను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అప్పగించారు. దీంతో ఆయన అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఈ క్రతువుకు హాజరుకానున్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర విఐపిలూ హాజరయ్యే అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పి ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. యాదగిరిగుట్ట నుంచి రుత్వికులు, అర్చకులు, వేద పండితులు ఈ యాగం నిర్వహించనున్నారు.
ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై పడకుండా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా రావాలని, కృష్ణా-గోదావరి నదులు జల కళతో పరవళ్ళు తొక్కాలని, నాగార్జున సాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు సంపూర్ణంగా నిండాలనే మహోన్నత సంకల్పంతో ఈ మహా వరుణ యాగాన్ని సంకల్పించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా ఇటీవల యాదగిరి గుట్ట, ధర్మపురి ఆలయాల పూజారులు వరుణ యాగం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు చిలుకూరు బాలాజీ దేవాలయం పూజారులు కూడా వరుణ జపం చేశారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. వర్షాలు లేక రైతులు, ప్రజలు అల్లాడారు. జలాశయాలు ఎండిపోయాయి. ఒక దశలో గండిపేట జలాశయం పూర్తిగా ఎండిపోయి బీటలు వారింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆ బీటలపైనే సర్వమత ప్రార్థనలు జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పి. శంకర్ రావు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ‘క్లౌడ్ బర్ట్’ కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాలు కురవాలని ఆకాశంలో మేఘాలపై హెలికాప్టర్స్ ద్వారా రసాయనాలు చల్లించడంతో అప్పట్లో తీవ్ర విమర్శలను శంకర్ రావు ఎదుర్కొవాల్సి వచ్చింది.
నైరుతి రుతుపవనాల కాలం సగం దాటి ఆగస్టు రెండో వారంలోకి ప్రవేశించినా తెలంగాణకు జీవనదులైన కృష్ణా, గోదావరి నదులకు స్థిరమైన ప్రవాహాలు ఇంకా పూర్తి స్థాయిలో అందడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు పూర్తి స్థాయిలో నిండాలంటే తెలంగాణలో వర్షాలతోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ విస్తారంగా వర్షాలు కురవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా-గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించనుంది. తెలంగాణతోపాటు కృష్ణా, గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా, సకాలంలో వర్షాలు కురవాలని, నదులకు స్థిరమైన ప్రవాహాలు రావాలని, జలాశయాలు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, వ్యవసాయానికి సమృద్ధిగా నీరు అందాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, పంటలకు సాగునీటి కొరత తలెత్తకుండా కృష్ణా, గోదావరి నదులకు సమృద్ధిగా ప్రవాహాలు రావాలన్న సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రోజంతా ప్రత్యేక వైదిక క్రతువు నిర్వహించనున్నారు.
వరుణ యాగం ప్రాంగణానికి హెలికాప్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ఇదిలాఉండగా సాగర్ తీరాన విజయ్ విహార్ పర్యాటక అతిథి గృహం ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 2.45 గంటలకు నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని బిసి రెసిడెన్షియల్ స్కూల్‌కు చేరుకుని, అక్కడి నుంచి విజయ్ విహార్ అతిథి గృహం ప్రాంగణానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. యాగం ముగిసిన అనంతరం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారు.








