ఉత్తరప్రదేశ్ సెవతా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన కుమార్తె ప్రగ్యాను మోసం చేసినందుకు అనుజ్ త్రివేది, అతడి కుమారుడు ప్రకర్ త్రివేదిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఆగస్టు 9న ఎమ్మెల్యే ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.

2024లో మిశ్రిఖ్ ప్రాంతానికి చెందిన ప్రకర్ త్రివేదితో ఎమ్మెల్యే కుమార్తె ప్రగ్యా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ప్రకర్ త్రివేది తండ్రి అనుజ్ త్రివేది, తాము ముంబైలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులమని ఎమ్మెల్యేకు నమ్మబలికారు. వివాహానికి ముందు పలువురు ప్రభావవంతమైన వ్యక్తులను ఆరా తీయగా, వారి గురించి మంచి సమాచారం అందడంతోనే ఎమ్మెల్యే పెళ్లికి అంగీకరించారు.

అయితే, వివాహం జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రకర్ త్రివేది నేర చరిత్ర బయటపడింది. ప్రకర్ త్రివేది వివిధ రాష్ట్రాల్లో నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించి పలువురు మహిళలను మోసం చేశాడని, వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడని ఎమ్మెల్యే ఆరోపించారు. నిందితుడు ఇప్పటివరకు దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే నిందితుడి కుటుంబంతో అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తన కుమార్తెను ఇంటికి తీసుకువచ్చిన ఆయన, ఈ ఘటన తన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు అనుజ్ త్రివేదికి మరణశిక్ష విధించాలని, తన అల్లుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.