ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో మొత్తం 30,53,238 ఓట్లకు గాను, ఇప్పటివరకు 26,76,641 ఓట్ల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం నేరం కావడంతో, చట్టపరమైన చర్యలు తప్పవన్న హెచ్చరికల నేపథ్యంలో చాలామంది తమ పట్టణ ఓట్లను తొలగించుకుని సొంతూరిలోనే ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు.

ఈ సవరణ ప్రక్రియలో భాగంగా చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు ఇలా మొత్తం 3,76,597 ఓట్లు సందేహాస్పద జాబితాలో చేరాయి. ఇందులో 1.70 లక్షల ఓట్లు మరణాలు లేదా వలసల కారణంగా తొలగించబడే అవకాశం ఉండగా, మరో 4,88,926 ఓట్ల వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత, వివరాల్లో తేడాలు ఉన్న వారికి తమ ఆధారాలను సమర్పించేందుకు అధికారులు మరో అవకాశం కల్పిస్తారు. జనగామ జిల్లాలోనే సుమారు 1,39,222 ఓట్లపై సందేహాలు ఉండగా, అందులో 63,825 మందికి అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు.

ఎన్నికల సంఘం కోరిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించని వారి ఓట్లు అనివార్యంగా తొలగిపోతాయి. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని, పేర్లలో మార్పులు ఉన్నవారికి కూడా నోటీసులు పంపి, ఆధారాలను నిరూపించుకోవాలని అధికారులు కోరనున్నారు.