ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యుజువేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. డర్హమ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చాహల్ 4 వికెట్లు తీసి, నార్తాంప్టన్‌షైర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగుల ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను చాహల్ అవుట్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆఫ్‌సైడ్ వెలుపల నుంచి వేసిన బంతి ఊహించని విధంగా మలుపు తిరిగి స్టోక్స్ బ్యాట్‌ను దాటుకుని నేరుగా వికెట్లను తాకింది. ఈ అద్భుతమైన బంతికి స్టోక్స్ ఏమీ చేయలేకపోయాడు.

చాహల్ బౌలింగ్‌కు స్టోక్స్‌తో పాటు అలెక్స్ లీస్, కేసీ ఆల్డ్రిడ్జ్ మరియు మాథ్యూ పాట్స్ కూడా వికెట్లు సమర్పించుకున్నారు. ఈ డెలివరీని కౌంటీ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, దీనిని “సెన్సేషనల్” అని కొనియాడారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో చాహల్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అఖిబ్ నబీ, రాహుల్ చాహర్ వంటి భారత క్రికెటర్లు కూడా ఆడుతున్నారు. వీరంతా తమ ప్రదర్శనలతో అక్కడ రాణిస్తున్నారు.

ఇటీవల భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎంపిక చేసిన ఐదుగురు భారత బౌలర్ల జాబితాలో చాహల్‌కు చోటు దక్కింది. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ తర్వాత నాలుగో స్థానంలో చాహల్‌ను అర్ష్‌దీప్ ఎంపిక చేశాడు.