బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి అదే రుణగ్రహీతలకు లేదా వారికి సంబంధించిన వ్యక్తులు, సంస్థలకు విక్రయించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రుణ వసూలు ప్రక్రియలో భాగంగా బ్యాంకులు తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు, వాటిని తిరిగి ఎగవేతదారులకే అమ్మడం వల్ల రుణ క్రమశిక్షణ దెబ్బతింటుందని కేంద్ర బ్యాంక్ అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనను కొందరు రుణగ్రహీతలు కోరినప్పటికీ, నైతిక ప్రమాదాలకు దారితీస్తుందనే కారణంతో ఆర్‌బీఐ తిరస్కరించింది.

కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తులను గరిష్ఠంగా ఏడు సంవత్సరాల లోపు విక్రయించాల్సి ఉంటుంది. ఈ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా అమ్మేందుకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్‌బీఐ సూచించింది. ఒకవేళ బ్యాంకులు ఆ ఆస్తిని తమ సొంత కార్యాలయ అవసరాల కోసం వాడుకోవాలని నిర్ణయిస్తే, వాటిని ఆర్థికేతర ఆస్తుల జాబితా నుంచి తొలగించి స్థిరాస్తుల కింద నమోదు చేయాలి.

ఆస్తుల విలువను లెక్కించే విషయంలోనూ ఆర్‌బీఐ స్పష్టత ఇచ్చింది. రద్దు చేసిన రుణ పుస్తక విలువ, ఆస్తిని వెంటనే అమ్మితే వచ్చే అంచనా ధర.. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే, ఆ విలువనే బ్యాంకులు తమ ఖాతాల్లో నమోదు చేయాలి. రుణ ఎగవేతదారులకు ఎటువంటి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిబంధనలను తీసుకువచ్చింది.

ఈ మార్గదర్శకాలు 2026 అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. అప్పటి నుంచి డిఫాల్టర్లు తమ ఆస్తులను తిరిగి దక్కించుకునే అవకాశం ఉండదు. రుణ క్రమశిక్షణను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.