వినియోగదారుల వ్యవహారాల శాఖ తాజా గణాంకాల ప్రకారం, గత ఐదు నెలల్లో 99 శాతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. రక్షాబంధన్, గణేష్ చవితి, దీపావళి వంటి పండుగలు రానున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

పప్పుధాన్యాల ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. కందిపప్పు ధర కిలోకు సుమారు రూ.6 పెరిగి రూ.123.46కు చేరగా, మినపప్పు రూ.121.51, శనగపప్పు రూ.86.66గా నమోదయ్యాయి. వంట నూనెల విషయానికి వస్తే, ఆవ నూనె లీటరుకు రూ.7.56 పెరిగి రూ.196.44కు చేరింది. సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్ ధరలు కూడా 4 నుంచి 4.5 శాతం వరకు పెరిగాయి. అదనంగా, పాల ధర లీటరుకు రూ.3 పెరగడం కుటుంబాల నెలవారీ ఖర్చులను మరింత పెంచింది.

చక్కెర ధర కిలోకు రూ.2.25 పెరిగి రూ.49.33కు చేరింది. అయితే, గోధుమ నిల్వలు తగినంతగా ఉండటంతో పిండి ధర కిలోకు రూ.37.35 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పండుగలకు ముందు రిటైలర్లు, ప్రాసెసర్లు భారీగా నిల్వలు సేకరించడం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఖరీఫ్ సీజన్‌లో అనిశ్చిత రుతుపవనాల వల్ల పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 7 శాతం తగ్గడం ధరల పెరుగుదలకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా గొలుసులను ప్రభావితం చేయడంతో దిగుమతి చేసుకునే నూనెల ధరలు పెరిగాయి. ముడి చమురు, వంట నూనెల ధరలు తగ్గితేనే మార్కెట్లో ఉపశమనం లభిస్తుందని, లేని పక్షంలో పండుగల కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.