చాలా మంది 24 క్యారెట్ల బంగారాన్ని కొని ఆభరణాలు చేయించుకుంటారు. అయితే, 24 క్యారెట్ల బంగారం చాలా మెత్తగా ఉండటం వల్ల దానితో నేరుగా నగలు చేయడం సాధ్యం కాదు. అందుకే స్వర్ణకారులు బంగారంలో ఇతర లోహాలను కలిపి ఆభరణాలను తయారు చేస్తారు.

24 క్యారెట్ల బంగారం అంటే 99.9 శాతం స్వచ్ఛత కలిగినది. ఇందులో రాగి, వెండి, నికెల్, కాడ్మియం, పల్లాడియం, జింక్ వంటి లోహాలను కలిపినప్పుడు దాని స్వచ్ఛత 22 క్యారెట్లకు తగ్గుతుంది. ఆభరణాల తయారీలో ఈ లోహాలను కలపడం వల్ల అవి గట్టిగా మారుతాయి.

మీరు కొనే 22 క్యారెట్ల ఆభరణాల్లో 91.6 శాతం మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 8.4 శాతం ఇతర లోహాలు ఉంటాయి. దీన్నే మార్కెట్లో 916 కేడీఎం (KDM) గోల్డ్ అని పిలుస్తారు.

ఆభరణాల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. 22 క్యారెట్ల ఆభరణాల్లో ఇతర లోహాల కలయిక తక్కువగా ఉంటుంది. అదే 18 క్యారెట్ల ఆభరణాల తయారీలో ఇతర లోహాల వాడకం ఎక్కువగా ఉంటుంది.

బంగారం కొనడం మంచి పెట్టుబడి అని, కష్టకాలంలో ఇది ఆదుకుంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆభరణాలుగా మారిన తర్వాత బంగారం స్వచ్ఛత శాతం తగ్గుతుందని గమనించాలి.