తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు నందకం యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను భక్తులు రియల్ టైమ్‌లో అంటే సమస్య జరిగిన వెంటనే నమోదు చేయవచ్చు. వీటి పరిష్కారాన్ని పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను, అంటే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి రూపొందిస్తున్నారు.
సెప్టెంబర్ 15న జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పారిశుద్ధ్య పనులను టీటీడీ వేగవంతం చేసింది. తిరుమలతో పాటు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు, అలిపిరి ఫుట్‌పాత్ వంటి ప్రాంతాల్లో కూడా స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల్లో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు అవుతున్నాయి.
తిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ, కొందరు భక్తులు వాహనాల కిటికీల నుంచి చెత్తను బయటకు విసిరేస్తున్నారని అదనపు ఈవో ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర క్షేత్రం స్వచ్ఛతను కాపాడటంలో సిబ్బందితో పాటు భక్తులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది.







