టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ చేపట్టిన 791 వేదపారాయణదారుల నియామకాల్లో ఆంధ్రప్రాంతానికి పెద్దపీట వేశారని, ఇతర రాష్ర్టాల అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలంగాణతో పాటు పలు రాష్ర్టాల వేదపండితులు ఆరోపిస్తున్నారు. ఈ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అర్హత లేని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి ఎటువంటి స్టే లేదా ఆదేశాలు రాకముందే నియామక ప్రక్రియను ముగించేందుకు టీటీడీ అధికారులు హడావుడి చేస్తున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిబంధనలను పక్కన పెట్టి, శని, ఆదివారాల్లోనే విధుల్లో చేరాలని ఎంపికైన అభ్యర్థులకు మెసేజ్‌లు పంపారు. ఎటువంటి ఎన్‌వోసీలు అవసరం లేదని, వెంటనే తిరుపతికి వచ్చి జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలని టీటీడీ ఉద్యోగి ఒకరు ఫోన్ ద్వారా సూచిస్తున్న కాల్ రికార్డులు సోషల్ మీడియాలో ాయి. గతంలో 2017లో ఎంపికైన అభ్యర్థుల మార్కులు, కటాఫ్ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచేవారు.

కానీ, ఈసారి ఎటువంటి మార్కులు లేదా కటాఫ్ వివరాలు వెల్లడించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పండితులు విమర్శిస్తున్నారు. కొత్త చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జోక్యంతోనే ఈ నియామకాలు జరిగాయని, హైదరాబాద్ ఎన్నికల ఖర్చు కోసం మధ్యవర్తిత్వం చేసిన వారికి అర్హత లేకున్నా ఉద్యోగాలు కల్పించారని టీటీడీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ నియామకాల్లో జరిగిన అన్యాయంపై మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల అభ్యర్థులు కూడా స్పందించారు.

తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే తిరుమలకు వచ్చి నిరసన తెలుపుతామని వారు తెలంగాణ అభ్యర్థులకు సందేశాలు పంపారు. అర్హులైన వారికి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.