నవంబర్ 21న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌తో తలపడిన ఎంఐ ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, తన బ్యాటింగ్‌లో తొలి పరుగుతోనే 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతడి ఖాతాలో 14,999 పరుగులు ఉండగా, మొత్తం 15 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసి 15,014 పరుగులకు చేరుకున్నాడు.
ఈ ఘనతతో టీ20 ఫార్మాట్‌లో 15 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా పొలార్డ్ నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ 15,062 పరుగులతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉండగా, పొలార్డ్ అతడికి కేవలం 48 పరుగుల దూరంలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు, ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్ బ్యాటర్‌గా ఈ మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా పొలార్డ్ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
పొలార్డ్ ఇప్పటివరకు 755 టీ20 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 672 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతడు, 31.67 సగటుతో రెండు సెంచరీలు, 71 అర్ధసెంచరీలు సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తూ 341 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ జట్టు 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ 174 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో డెజర్ట్ వైపర్స్ 122 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు, జహూర్ ఖాన్ మూడు వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు.
ఇక జోస్ బట్లర్ రికార్డును అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం పొలార్డ్‌కు త్వరలోనే ఉంది. నవంబర్ 24న గల్ఫ్ జెయింట్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో పొలార్డ్ మరో 49 పరుగులు చేస్తే అగ్రస్థానానికి చేరుకుంటాడు.






