రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దోహాలో జరిగిన 8వ మ్యాచ్‌లో భారత్-A జట్టు 48 పరుగుల తేడాతో పాకిస్థాన్-A చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్దేశించిన 314 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 265 పరుగులకే ఆలౌటైంది.

భారత కెప్టెన్ తిలక్ వర్మ 149 బంతుల్లో 100 పరుగులు చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన తిలక్, సహచరుల నుంచి తనకు తగిన సహకారం లభించలేదని ఓటమికి కారణం చెప్పాడు.

గెలవడమే తనకు ముఖ్యమని, మరో బ్యాటర్ సపోర్ట్ ఉంటే మ్యాచ్ ఫినిష్ చేసేవాడినని తిలక్ తెలిపాడు. అయితే అతడి ఈ వ్యాఖ్యలపై క్రికెట్ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓపెనర్ అభిషేక్ శర్మ 42 బంతుల్లో 70 పరుగులు చేసి దూకుడుగా ఆడితే, ఆ సమయంలో తిలక్ 36 బంతుల్లో కేవలం 8 పరుగులే చేశాడు. జట్టు 129 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు షాబాజ్ అహ్మద్ 49 బంతుల్లో 56 పరుగులు చేసి తిలక్‌కు అండగా నిలిచాడు.

వీరిద్దరూ ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించినా, భారీ షాట్‌కు ప్రయత్నించి షాబాజ్ ఔటయ్యాడు. అభిషేక్, షాబాజ్ వేగంగా ఆడుతున్న సమయంలో తిలక్ వరుస డాట్ బాల్స్ ఆడి ఒత్తిడి పెంచాడని విమర్శలు వచ్చాయి.

సెంచరీ పూర్తయిన వెంటనే భారీ షాట్‌కు యత్నించి తిలక్ వెనుదిరిగే నాటికి చివరి 6 బంతుల్లో 48 పరుగులు అవసరమవడంతో గెలుపు అసాధ్యమైంది. సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోగా, సహచరులను తప్పుబట్టడం పట్ల నెటిజన్లు, మాజీ క్రీడాకారులు తిలక్‌పై మండిపడుతున్నారు.