ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట చేర్చేలా మీసేవ ఆధ్వర్యంలో ఈ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు అవసరమైన బస్సు, మెట్రో టికెట్లతో పాటు ఆటో లేదా క్యాబ్‌ను కూడా ఈ యాప్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకునే వీలుంటుంది.
ఈ యాప్ ఒక ఉమ్మడి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. ప్రయాణికులు చెల్లించే డబ్బును ఆయా రవాణా సంస్థలకు, డ్రైవర్లకు ఆటోమేటిక్‌గా జమ చేసేలా ఆధునిక చెల్లింపుల వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, రవాణా భాగస్వాములకు లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి.
మరోవైపు, ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నడుపుతుందనే ప్రచారంలో నిజం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదని, కేవలం వివిధ రవాణా సేవలను అనుసంధానించడం మాత్రమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ విషయంలో ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని కోరారు.








