న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) పరిధిలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) సంస్థ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో పాసైన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి అదనపు అర్హత లభిస్తుంది.
డిసెంబర్ 23, 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
నింపిన దరఖాస్తులను 'సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, CSIR- నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ, డాక్టర్ కె.ఎస్. కృష్ణన్ మార్గ్, న్యూఢిల్లీ - 110012' చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి. దరఖాస్తులు చేరుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 23గా నిర్ణయించారు.
అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల పరిశీలనతో పాటు రాత పరీక్ష నిర్వహిస్తారు. OMR పద్ధతిలో జరిగే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు గాను ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
ఈ రాత పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలకు 75 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలకు 75 మార్కులు కేటాయించారు. అలాగే జనరల్ అవేర్నెస్ విభాగంలో 50 ప్రశ్నలకు 150 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో 50 ప్రశ్నలకు 150 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. మరిన్ని వివరాల కోసం www.nplindia.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.







