ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా 73.38 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. ఇందులో 43 లక్షల ఓట్లు కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం. సోమవారం విడుదల కానున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో, ఎవరివి తొలగిపోయాయో స్పష్టత రానుంది.

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా ఓట్లు తొలగిపోతున్నాయి. ఉద్యోగాలు, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు తమ సొంత రాష్ట్రాల్లోనే ఓటును కొనసాగించడానికి మొగ్గు చూపడం వల్ల ఈ మార్పులు చోటుచేసుకున్నాయని అంచనా.

ఈ పరిణామంపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన సిట్టింగ్ స్థానాల్లో ఓట్ల తొలగింపుపై ఈ నెల 18 తర్వాత సమీక్ష నిర్వహించనుంది.