ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి తాను పార్టీలో కొనసాగుతున్నానని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని చిన్నారెడ్డి చెప్పారు. అయితే, ఒక్క నిర్ణయంతో తనను పదవి నుంచి తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవి ఉన్నా, లేకున్నా తనకు దక్కాల్సిన గౌరవం తనకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవలేదని, కలిసేందుకు ప్రయత్నించలేదని చిన్నారెడ్డి తెలిపారు. కొండా సురేఖ ఢిల్లీ వెళ్లినా ఫలితం లేదని, తన పరిస్థితి కూడా అదేనని భావించి తాను వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. వీ హనుమంతరావు తర్వాత కాంగ్రెస్ పార్టీలో తానే సీనియర్ నాయకుడినని ఆయన గుర్తు చేశారు.
తనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల్లో కాల పరిమితిని పేర్కొనలేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పదవిలో ఉంటానని మాత్రమే రాసి ఉందని ఆయన వివరించారు. తన కుమారుడికి పదవి ఇవ్వాలని తాను ఎప్పుడూ ముఖ్యమంత్రిని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తలెత్తిన ఈ సమస్యలకు ఎంపీ మల్లు రవి కారణమని చిన్నారెడ్డి ఆరోపించారు.
భవిష్యత్తులో తాను ఏం చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఈ అంశంపై తాను త్వరలో ఆలోచిస్తానని తెలిపారు. తన తదుపరి కార్యాచరణపై స్పష్టత రావాల్సి ఉంది.








