భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలతో ఈ వేడుకలు మొదలయ్యాయి. క్రీడా స్ఫూర్తిని, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడంపై సాట్స్ దృష్టి సారించింది. 'ఖేలేగా భారత్ – జీతేగా భారత్' నినాదంతో యువతను, విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు.
ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 'ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే' పేరుతో క్రీడా మైదానాల్లో పోటీలు నిర్వహించారు. ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడలతో పాటు '29 ఛాలెంజ్', 'పాస్ ద బాల్ ఛాలెంజ్' వంటి ప్రత్యేక ఈవెంట్లను చేపట్టారు. ఇందులో మహిళలు, యువత, వృద్ధులు మరియు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.
చివరి రోజైన ఆగస్టు 30న ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు 'స్పెషల్ సండేస్ ఆన్ సైకిల్', రన్‌లు, వాకథాన్‌లను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఫిట్ ఇండియా ఉద్యమ సందేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా సాట్స్ ఈ వేడుకలను నిర్వహించింది.
రాష్ట్రవ్యాప్తంగా లభించిన ఈ స్పందన తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని సాట్స్ అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రీడలు, ఫిట్‌నెస్ కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.






