తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యనేత ఒకరు తన సొంత వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) అప్రమత్తమైంది. పార్టీలో అసలు కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి, వలస వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏఐసీసీకి రహస్య నివేదికలు అందాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించే బాధ్యతను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీనటరాజన్‌కు అధిష్ఠానం అప్పగించింది.
గత మూడు వారాలుగా మీనాక్షీనటరాజన్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో వరుసగా ఏకాంత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షకే పరిమితం కాకుండా, గ్రామస్థాయిలో క్యాడర్‌తో నాయకుల అనుబంధం, 2022 తర్వాత పార్టీలోకి వచ్చిన వారి వివరాలు, వారి విధేయత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వారిని గుర్తించి, సంస్థాగత శక్తిని తిరిగి బలోపేతం చేయడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.
మరోవైపు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు వరుసగా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ కార్యాలయాల్లో వినిపిస్తున్న నినాదాల కంటే, వార్ రూముల్లో జరుగుతున్న ఈ సమీక్షలే భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను నిర్దేశిస్తాయని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన అవకాశవాద రాజకీయాలకు కళ్లెం వేయాలని ఏఐసీసీ భావిస్తోంది. గాంధీ కుటుంబం, ఏఐసీసీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే సంప్రదాయ నాయకత్వాన్ని, కార్యకర్తలను తిరిగి ముందుకు తీసుకురావాలనే వ్యూహంతో మీనాక్షీనటరాజన్ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు.








