అమెరికా పౌరసత్వాన్ని అక్రమంగా పొందేందుకు జరుగుతున్న బర్త్ టూరిజం (birth tourism) వ్యవహారాలపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఆయన జూలై 21న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ GA-57పై సంతకం చేశారు. ఈ అక్రమ పద్ధతుల ద్వారా పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో జరుగుతున్న బర్త్ టూరిజం కార్యకలాపాలపై విచారణ జరపాలని టెక్సాస్ రాష్ట్ర ఏజెన్సీలను గవర్నర్ ఆదేశించారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించి, వారిని బాధ్యులను చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, లైసెన్స్ పొందిన సంస్థలు లేదా వ్యక్తులు ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. చట్టవిరుద్ధంగా పౌరసత్వం పొందేలా ప్రోత్సహించే వారిపై అధికార యంత్రాంగం దృష్టి సారించనుంది.







