టేక్మాల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సుధాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే, జెండాను ఎగురవేసే క్రమంలో కాషాయ రంగు కిందికి, ఆకుపచ్చ రంగు పైకి వచ్చేలా తలకిందులుగా కట్టారు.

ఈ దృశ్యాన్ని గమనించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. పొరపాటును గుర్తించిన నిర్వాహకులు వెంటనే జెండాను దించి, సరైన పద్ధతిలో తిరిగి ఎగురవేశారు.

దేశ గౌరవానికి ప్రతీక అయిన జాతీయ జెండా విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు కోరారు. ఇలాంటి పనుల్లో నిర్లక్ష్యం తగదని వారు అసహనం వ్యక్తం చేశారు.