జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన విధానంపై మాజీ క్రికెటర్ సద్గోపన్ రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తున్నామని చెబుతున్న సెలెక్టర్లు, ఆ నిబంధనను కొందరికే పరిమితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా 2025, 2026 సీజన్లలో వరుసగా ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నుంచి ఒక్క ఆటగాడికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై రమేష్ మండిపడ్డారు. ఐపీఎల్ 2026లో 28 వికెట్లతో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన భువనేశ్వర్ కుమార్‌ను పక్కన పెట్టడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, వికెట్ల జాబితాలో వెనుకబడిన హర్ష్ దూబే, అశోక్ శర్మ, యష్ ఠాకూర్ వంటి వారికి చోటు కల్పించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సెలెక్టర్ల ఎంపిక తీరుపై రమేష్ మరిన్ని విమర్శలు చేశారు. ఐపీఎల్‌లో కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని సూర్యాంష్ షెడ్గేను ఆల్‌రౌండర్‌గా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అలాగే, ఐపీఎల్ రెండో అర్ధభాగంలో తుది జట్టులో చోటు దక్కించుకోని రవి బిష్ణోయ్‌ను టీమిండియాలోకి తీసుకోవడం, సరిగా మ్యాచ్‌లు ఆడని మయాంక్ యాదవ్‌ను ఎంపిక చేయడంపై ఆయన నిలదీశారు.
శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీలకు ఐపీఎల్ ప్రదర్శన ప్రాతిపదికన అవకాశం ఇచ్చినప్పుడు, ఇతర ఆటగాళ్ల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని రమేష్ ప్రశ్నించారు. ఆర్సీబీపై సెలెక్టర్లు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇలాంటి పక్షపాతం ఉంటే ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించడమే మేలని ఘాటుగా వ్యాఖ్యానించారు.







