తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుమతులను సులభతరం చేసేందుకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టీఎస్‌-ఐపాస్‌ (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా కంపెనీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోనే అనుమతులు వస్తాయి. ఒకవేళ 15 రోజుల్లో అనుమతులు రాకపోతే, ఆ మరుసటి రోజు నుంచే ఆన్‌లైన్ ద్వారా అనుమతి లభించినట్లుగా పరిగణిస్తారు.

ఈ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు సులభతరం కావడంతో, నీతి ఆయోగ్‌ (భారత ప్రభుత్వ మేధో సంస్థ) కూడా దీనిని ప్రశంసించింది. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటిగా టీఎస్‌-ఐపాస్‌ నిలిచిందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. ఈ విజయవంతమైన నమూనాను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అనుసరించాలని నిర్ణయించుకుంది.

తమిళనాడులో పరిశ్రమల అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర ఫైనాన్స్‌ సెక్రటరీ ఎంఏ సిద్ధిఖీ తెలిపారు. ‘సీఐఐ తమిళనాడు ఫైనాన్స్‌ కాంక్లేవ్‌-2026’ సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పరిశ్రమలకు 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా ఈ పాలసీని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ కొత్త విధానంలో కూడా టీఎస్‌-ఐపాస్‌ తరహాలోనే డీమ్డ్‌ అప్రూవల్‌ (నిర్ణీత గడువులోగా అనుమతి రాకపోతే ఆటోమేటిక్‌గా అనుమతి లభించినట్లు భావించడం) సౌకర్యం ఉంటుంది. అంటే 21 రోజుల్లో అనుమతులు రాకపోతే, ఆ పరిశ్రమకు అనుమతి లభించినట్లేనని ప్రభుత్వం పరిగణిస్తుంది.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల నుంచి పుట్టిన ఈ విధానం, పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కట్టేలా చేసి యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మొదలైంది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో తమిళనాడు ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త పారిశ్రామిక విధానాన్ని త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.