రష్యా చరిత్రలోనే తొలిసారిగా రోబోల వివాహం మాస్కోలోని పుష్కిన్ లైబ్రరీలో అత్యంత వైభవంగా జరిగింది. సూట్ ధరించిన వరుడు రాబర్ట్, పెళ్లి గౌనులో ఉన్న వధువు మటిల్డా అతిథుల కరతాళ ధ్వనుల మధ్య మండపంలోకి ప్రవేశించారు. ఈ అరుదైన వేడుకను చూసి భవిష్యత్తు ఇంత త్వరగా వచ్చేసిందా అని అందరూ ఆశ్చర్యపోయారు.

జూలై 8న రష్యాలో జరుపుకునే ప్రాచీన సాంస్కృతిక పండగ సందర్భంగా ఈ వివాహాన్ని నిర్వహించారు. పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలోనే కార్యక్రమం సాగింది. ముందుగా ప్రోగ్రామ్ చేసిన వివాహ ప్రమాణాలను ఈ రోబోలు ఒకరి ముందు ఒకరు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్‌లో విస్తృతంగా వ్యాపించింది.

వివాహ కంకణాలను తీసుకురావడానికి 'డాగ్మాటిక్' అనే రోబోటిక్ కుక్క వేదికపైకి వచ్చింది. ఆ తర్వాత రాబర్ట్, మటిల్డా ఒకరికొకరు కంకణాలు తొడుక్కోగా, హోస్ట్ వారిని రోబో భార్యాభర్తలుగా ప్రకటించారు. ఈ రోబోలు ఇప్పుడు మనిషి సాయం లేకుండా మాట్లాడగలవు, స్వరాలను గుర్తించగలవు.

రోబోలు నిజంగా ప్రేమలో పడ్డాయా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే, ఈ రోబోలను రూపొందించిన డెవలపర్లు, నిర్వాహకులు మాత్రం ఇది కేవలం ముందుగా ప్రోగ్రామ్ చేసిన స్క్రిప్టెడ్ షో మాత్రమేనని స్పష్టం చేశారు.