అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండ సముదాయంలో ఉన్న సాధుకొండలో మైనింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ స్థానిక భక్తులు, మహిళలు, వృద్ధులు శనివారం నిరసన చేపట్టారు. సుమారు 1,500 అడుగుల ఎత్తు ఉన్న ఈ కొండపైకి బోరెడ్డివారికోట నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు, మైనింగ్ వల్ల కొండ నాశనం కాకుండా కాపాడాలని శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ఈ కొండను ఏపీఎండీసీ (APMDC)కి కాంపోజిట్ లైసెన్స్ ద్వారా మైనింగ్‌కు కేటాయించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో యువకులు, వృద్ధులు పాల్గొన్నారు. దారి లేని కొండపై బండరాళ్లు, చెట్ల మధ్య శ్రమించి భక్తులు పైకి చేరుకున్నారు.
ఈ నిరసనలో భాగంగా వందమంది వరకు భక్తులు కొండపైనే రాత్రి బస చేస్తున్నారు. వీరిలో 84 ఏళ్ల వయసున్న పెద్దమండ్యం సింగిల్ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత కడప సుధాహర రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు దేవరింటి రామకృష్ణారెడ్డి, దేవరింటి రవిశంకర్‌రెడ్డి ఉన్నారు. మైనింగ్ ఆగిపోవాలని, వర్షాలు కురవాలని కోరుతూ భక్తులు శివనామ స్మరణతో కొండను మార్మోగించారు.








