మానసిక విశ్లేషకులు, నిపుణులు వ్యక్తిగత విషయాలను స్నేహితులతో పంచుకోకూడదని హెచ్చరిస్తున్నారు. స్నేహితులతో మనసు విప్పి మాట్లాడటం మంచిదే, కానీ కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం అవసరం.
దాంపత్య జీవితంలో గొడవలు, భాగస్వామిపై నెగటివ్ అభిప్రాయాలు స్నేహితుల మనసులో నిలిచే ప్రమాదం ఉంది. అందువల్ల, వివాదాలను స్వయంగా పరిష్కరించడం, స్నేహితులకు చెప్పకుండా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.
ఫోన్ లాక్ పాస్‌వర్డ్, యుపీఐ పిన్, ఈమెయిల్ పాస్‌వర్డ్, ఎటిఎమ్ కార్డ్ పిన్ లేదా ఇతర బ్యాంకింగ్ సమాచారం స్నేహితులతో పంచుకోవద్దు. నమ్మకమైన వ్యక్తి అయినప్పటికీ, ఆర్థిక సంబంధిత డిజిటల్ భద్రతా వివరాలు ఎల్లప్పుడూ గోప్యంగా ఉండాలి.
కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణాలు, వ్యాపార ప్రణాళికలు లేదా ఇతర ముఖ్య నిర్ణయాలు పూర్తిగా కార్యరూపం దాల్చే వరకు ఎవరికీ చెప్పకపోవడం అవసరం. అలాగే, వ్యక్తిగత బలహీనతలు, కుటుంబ అంతర్గత విభేదాలు కూడా స్నేహితులతో పంచుకోకపోవడం ద్వారా మీ నమ్మకాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా సెల్ఫ్ కంట్రోల్, గోప్యత పాటించడం మీ వ్యక్తిగత జీవితం, స్నేహబంధం రెండింటినీ బలంగా నిలబెడుతుంది.








