శ్రీరాంసాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వలు సాగు అవసరాలకు సరిపోవని నీటిపారుదల శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. ఈ నేపథ్యంలో, జలాశయాల్లోకి నీరు చేరుతోందని రైతులు తొందరపడి పంటలు వేయవద్దని, ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు సూచించారు. శనివారం మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌ బాబు, జి.వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హెలికాప్టర్‌లో ఈ ప్రాజెక్టులను సందర్శించి నిల్వలను పరిశీలించారు.

ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఇందులో తాగునీరు మరియు మిషన్ భగీరథ అవసరాలకు 6 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు తెలిపారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు నిండినందున, అక్కడి నుంచి విడుదలైన నీరు మరో వారం రోజుల్లో శ్రీరాంసాగర్‌కు చేరుకునే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండటం వల్ల కూడా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇప్పటికే 20 టీఎంసీల నీటిని కిందికి విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోస్తే, ఆ నీటిని మళ్లీ వృథాగా కిందికి వదలాల్సి వచ్చేదని, దీనివల్ల విద్యుత్ వృథా అయ్యేదని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు కేంద్రంలోని నిపుణులతో చర్చిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయని, అయితే గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మూడేళ్లకే కూలిపోయాయని మంత్రులు విమర్శించారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా, దేవాదుల, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేదని వారు ఆరోపించారు.