స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లిలో కోనసీమ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ చేపట్టి, వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. కమిటీల్లో చురుకైన, ఉత్సాహవంతులైన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అనుబంధ విభాగాల ద్వారా ఏర్పడిన నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైనంత మాత్రాన ప్రక్రియ పూర్తయినట్లు భావించకూడదని, బూత్ స్థాయి ఏజెంట్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన కోరారు. జాబితాలో అభ్యంతరాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, అర్హుల పేర్లను ఫారం-6 ద్వారా చేర్చాలని, అనర్హుల పేర్లపై ఫారం-7 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ విషయాన్ని ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. స్థానిక నాయకత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యలపై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు.







