రాష్ట్ర సచివాలయం నుంచి హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్‌హెచ్‌ఓలు, రేంజ్ ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. డీజీపీ నుంచి క్షేత్రస్థాయి ఎస్‌హెచ్‌ఓ వరకు అందరితో ఒకేసారి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నేరాల దర్యాప్తులో టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకోవాలని, నేర నియంత్రణలో 'గోల్డెన్ అవర్' అత్యంత కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 14,770 సీసీ కెమెరాలతో పాటు ప్రైవేటు కెమెరాలను కలిపి మొత్తం లక్ష కెమెరాలను అనుసంధానించినట్లు తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, డీఎన్‌ఏ డిటెక్షన్ వంటి ఆధునిక పద్ధతులను వాడుతూ నేరస్తులను వేగంగా గుర్తించాలని సూచించారు. గత రెండేళ్లలో కాగ్నిజబుల్ క్రైమ్స్ 14 శాతం తగ్గాయని, అయితే డిజిటల్ నేరాలు, సోషల్ మీడియా అసభ్య పోస్టులు కొత్త సవాళ్లుగా మారాయని ఆయన వివరించారు.
మహిళలపై నేరాల విషయంలో 'జీరో టాలరెన్స్' పాటించాలని, గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు 'డ్రగ్స్ వద్దు బ్రో' ప్రచారాన్ని విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో ఆధారాలను చెరిపేసే ప్రయత్నం జరిగిందని, అది పోలీసుల వైపు నుంచి జరిగిన పెద్ద పొరపాటు అని ఆయన గుర్తు చేశారు. ఇకపై నేరం జరిగిన ప్రాంతాన్ని సంరక్షించడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.
రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం, సైబర్ నేరాలు, బ్లేడ్ బ్యాచ్‌ల ఆగడాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తూనే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సైనేజీలు, రోడ్ ఇంజనీరింగ్, హాట్‌స్పాట్‌ల ఆడిట్ నిర్వహించాలని సూచించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు జాతీయ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.








