మంగళగిరిలోని అరణ్య భవన్‌లో నాగబాబు ఏపీ గ్రీన్ సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన తన భార్యతో కలిసి పూజలు నిర్వహించి ఈ పదవిని చేపట్టారు. ఈ పదవికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది.

బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాగబాబు దంపతులు ఉండవల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు దంపతులను చంద్రబాబు సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. విజన్ 2047లో భాగంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం అడవులు, చెట్లను పెంచాలనేది ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగానే నాగబాబుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ పదవిలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.