దశాబ్దాలుగా కరువు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల కోసం వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 10.15 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లికి చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రత్యేక పూజల అనంతరం ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి నల్లమలసాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేస్తారు.

శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు ఫేజ్-1 ద్వారా 10.70 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లోని 23 లక్షల మందికి తాగునీటి అవసరాలు తీరనున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 రోజుల్లోనే నిర్వాసితులకు రూ.768 కోట్ల పరిహారాన్ని చెల్లించి పనులను వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల వ్యవసాయ రంగం బలోపేతం కావడంతో పాటు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం గంటవానిపల్లిలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.