న్యూయార్క్‌లోని బెంజమిన్ ఎన్. కార్డోజో హైస్కూల్‌లో నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ (NJROTC) విభాగంలో రిద్ధి చౌహాన్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 17 ఏళ్ల రిద్ధి, ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్‌లో అత్యున్నత హోదాను దక్కించుకున్న తొలి భారతీయ సంతతి విద్యార్థినిగా చరిత్ర సృష్టించారు.

ప్రస్తుతం తన పాఠశాల పరిధిలోని 300 మంది క్యాడెట్లకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. వారి శిక్షణ, రోజువారీ విధివిధానాలు మరియు సంక్షేమ బాధ్యతలను పర్యవేక్షించడం ద్వారా క్యాడెట్ల భవిష్యత్తుకు ఆమె దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ బాధ్యతలకు ముందు అకడమిక్ కమాండర్, స్టెమ్ (STEM) కమాండర్, ప్లాటూన్ లీడర్ మరియు ఇన్స్‌పెక్షన్ కమాండర్‌గా వివిధ హోదాల్లో రిద్ధి తన ప్రతిభను చాటుకున్నారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దిలీప్ చౌహాన్, రుచిక దంపతుల కుమార్తె రిద్ధి, తన కుటుంబం అందించిన విలువలు మరియు భారతీయ సాంస్కృతిక వారసత్వమే తన నాయకత్వ లక్షణాలకు పునాది అని పేర్కొన్నారు. అకడమిక్ కమాండర్‌గా జాతీయ స్థాయి పోటీల్లో తన బృందాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే కాకుండా, రోబోటిక్స్‌లోనూ ప్రశంసలు అందుకున్నారు. సుమారు 200 మంది క్యాడెట్లకు పర్సనల్ మెంటార్‌గా వ్యవహరిస్తూ వారిని సమర్థులుగా తీర్చిదిద్దుతున్నారు.

భవిష్యత్తులో యూఎస్ నేవీలో ఆఫీసర్‌గా స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్న రిద్ధి, తదుపరి అడుగుగా యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్‌లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు.