దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సిమ్రాన్‌కు మోనాల్, జ్యోతి అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వీరు కూడా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా మోనాల్ తెలుగులో 'ఇష్టం' సినిమాతో పాటు, తమిళంలో విజయ్‌తో కలిసి నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది.
అక్క సిమ్రాన్ లాగే స్టార్ హీరోయిన్ కావాలని కలలు కన్న మోనాల్, 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అప్పటికి ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. ఈ ఘటన అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.
మోనాల్ మరణం వెనుక ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉన్నారని సిమ్రాన్ ఆరోపించారు. ప్రేమ పేరుతో అతను తన చెల్లిని మోసం చేశాడని, ఆ బాధను తట్టుకోలేకే మోనాల్ ఆత్మహత్య చేసుకుందని సిమ్రాన్ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే కాలక్రమేణా ఈ కేసు విచారణ నీరుగారిపోయింది. మోనాల్ మరణించి సుమారు 24 ఏళ్లు గడుస్తున్నా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇప్పటికీ సిమ్రాన్ తన చెల్లెలిని తలచుకుంటూనే ఉంటారు.
ప్రస్తుతం సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా సహాయక నటిగా రాణిస్తున్నారు. 'శబ్ధం', 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'టూరిస్ట్ ఫ్యామిలీ' వంటి సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా ఆమె సందడి చేస్తున్నారు.








