భక్తులకు పిలుపునిచ్చిన ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ; శ్రీ శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అత్యంత వైభవంగా అలంకరిస్తున్న నేపథ్యంలో భక్తులు అలంకరణను పరిరక్షించాలని ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారని, ప్రతి భక్తుడు ఒకే విధమైన దివ్య అలంకరణను దర్శించేలా సహకరించాలని కోరింది. అలంకరణలో ఉపయోగించిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తెంపడం, పాడు చేయడం లేదా ఇంటికి తీసుకెళ్లడం వల్ల క్షేత్రం తన సహజ సౌందర్యాన్ని కోల్పోతుందని పేర్కొంది. భక్తులు అలంకరణను తాకకుండా కేవలం దర్శించడానికే పరిమితం కావాలని, క్షేత్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించాలని సూచించింది. మీరు పరిరక్షిస్తే వేలాది మంది భక్తులు ఆ దివ్య సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు.. మీరు పాడు చేస్తే క్షేత్రం తన అందాన్ని కోల్పోతుంది” అని సమితి సభ్యులు పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రి క్షేత్రం అందరిదని, దాని పవిత్రత, సౌందర్యాన్ని కాపాడటం ప్రతి భక్తుని బాధ్యత అని ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి (సొసైటీ రిజిస్ట్రేషన్ నెం. 152/2026) పిలుపునిచ్చింది. అలాగే “అలంకరణను తాకవద్దు… అందాన్ని ఆస్వాదించండి”, “క్షేత్ర సౌందర్యాన్ని కాపాడటం కూడా భక్తిలో భాగమే” అనే సందేశాన్ని భక్తులకు అందించింది.