పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బీహార్ జిల్లా పానీశాల సరిహద్దు ప్రాంతంలో మానవ సంక్షోభం చోటుచేసుకుంది. ఇటీవల అక్రమ వలసల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో బిఎస్‌ఎఫ్ (భారత సరిహద్దు భద్రతా దళం) పహారాను పెంచింది. దీంతో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన కుటుంబాలను బిఎస్‌ఎఫ్ బంగ్లాదేశ్ వైపుకు పంపించగా, అక్కడి బోర్డర్ గార్డ్ సిబ్బంది వారిని స్వీకరించడానికి నిరాకరించారు. ఫలితంగా ఈ కుటుంబాలు రెండు దేశాల మధ్య ఉన్న జీరో లైన్‌లో గంటల తరబడి చిక్కుకుపోయాయి.
ఈ ఘటనలో చిన్నారులు వర్షంలో తడుస్తుండగా, మహిళలు నేలపైనే కూర్చోవాల్సి వచ్చింది. వృద్ధులు భయంతో వణికిపోయిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఖుల్నా నుంచి వచ్చినట్లు పేర్కొన్న ఓ మహిళ తమ గ్రామానికి వెళ్లనివ్వాలంటూ వేడుకున్న వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భద్రతా కారణాల పేరుతో జరుగుతున్న ఈ పరస్పర ఉద్రిక్తతల మధ్య మానవత్వం మరుగున పడి, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది.
సుమారు 4,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భూసరిహద్దుల్లో ఒకటి. నదులు, అడవులు, పొలాలు చొచ్చుకుని సాగే ఈ సరిహద్దులో పలుచోట్ల కంచెలు లేకపోవడంతో దశాబ్దాలుగా అక్రమ వలసలు, స్మగ్లింగ్ జరుగుతున్నాయి. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఆర్థిక ఇబ్బందులు, వరదలు, ఉపాధి లేమి కారణంగా పశ్చిమబెంగాల్, అసోం వంటి రాష్ట్రాలకు భారీగా వలసలు వచ్చాయి. ఈ అంశం ప్రస్తుతం పౌరసత్వం, ఓటర్ల జాబితాలతో పాటు ఎన్నికల రాజకీయాల్లోనూ కీలకంగా మారింది.
ఒక దేశం వారు మావారు కాదని చెబుతుంటే, మరో దేశం స్వీకరించమని నిరాకరిస్తోంది. ఈ రాజకీయ నాటకీయత మధ్య చిక్కుకున్నది మాత్రం నిండు ప్రాణాలు. సరిహద్దులను కంచెలతో మూసేయవచ్చు కానీ, ఆకలి, పేదరికం, నిరాశను అడ్డుకోలేమని కూచ్‌బీహార్ ఘటన హెచ్చరిస్తోంది. అంతర్జాతీయ మానవ హక్కుల సూత్రాల ప్రకారం మహిళలు, పిల్లలు, వృద్ధులకు కనీస రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని, పానీశాల వద్ద కనిపిస్తున్న భయం కేవలం ఒక కుటుంబానిదే కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








