భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా బుధవారం లీడ్స్‌లో నెదర్లాండ్స్‌తో తలపడి 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 17.3 ఓవర్లలోనే 114 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధాన 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ 38 బంతుల్లో 10 ఫోర్లు బాది 55 పరుగులు సాధించగా, రిచా ఘోష్ 20 పరుగులు చేశారు. బౌలింగ్‌లో శ్రీచరణి నాలుగు, షఫాలీ వర్మ మూడు, నందినీ శర్మ రెండు, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ సందర్భంగా స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తన కెరీర్‌లో 600 ఫోర్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది. పురుషులు మరియు మహిళల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా ఈ లెఫ్టాండర్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ఆమె 604 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బేట్స్ 521 ఫోర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

శ్రీలంకకు చెందిన చమరి ఆటపట్టు 493, పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజం 477, ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ 459, ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్ 449 ఫోర్లతో ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మంధాన సాధించిన ఈ రికార్డు క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఘనతగా నిలిచింది.