ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేంద్రం వద్ద ఉన్న భారీ ఆహార ధాన్య నిల్వల కారణంగా ఆహార భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 1 నాటికి దేశవ్యాప్తంగా 122 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి నిల్వలు ఉన్నాయి. ఇందులో 68.43 మిలియన్ టన్నుల వరి, 53.41 మిలియన్ టన్నుల గోధుమలు ఉండగా, ఇవి దాదాపు రెండేళ్లపాటు 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేయడానికి సరిపోతాయి.

అయితే ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉన్న 12 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం సాధారణ వర్షపాతం 62.1 మిమీ కావాల్సి ఉండగా, జూన్ 15 వరకు 42.4 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పప్పుధాన్యాల సాగు మందకొడిగా సాగుతుండగా, జూన్ 12 నాటికి సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 43 శాతం తగ్గింది.

ధరలను అదుపులో ఉంచడానికి, నిల్వలు వృథా కాకుండా చూడడానికి కేంద్రం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఒఎంఎస్‌ఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌సిఐ (భారత ఆహార సంస్థ) నుండి నేరుగా ధాన్యాలను కొనుగోలు చేసి, మార్కెట్లో విక్రయించవచ్చు. అయితే ఇథనాల్ ఉత్పత్తి కోసం సబ్సిడీ ధరలో బియ్యం కేటాయింపును తగ్గించాలని, నిల్వలను కాపాడుకోవాలని మాజీ అగ్రికల్చరల్ సెక్రటరీ సిరాజ్ హుస్సేన్ సూచించారు.

పప్పుధాన్యాల సాగు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కంది సాగు విస్తీర్ణం 57 శాతం, పెసర సాగు 55 శాతం, మినుము సాగు 22 శాతం తగ్గాయి. కర్ణాటక, మహారాష్ట్రలోని లాతూరు, సోలాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షాలు లేక విత్తనాలు నాటడం ఆలస్యమవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జులై మధ్య వరకు సాగు చేసినా, పంట చేతికి రావడానికి ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.