ఆదివారం సాయంత్రం మౌలాలి రైల్వే స్టేషన్‌లోని 6వ నంబర్ లెవల్ క్రాసింగ్ (LC) గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలులో జనగామ నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన యువతి, ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

వేగంగా వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యువతిని ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కళ్లముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరణించిన యువతి జనగామకు చెందిన వ్యక్తిగా, ప్రస్తుతం మౌలాలి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.