సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జరిగిన కో ఆర్డినేషన్ మీటింగ్‌లో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ, భక్తులకు తక్కువ సమయంలో దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

బోనాల కోసం వచ్చే సాధారణ మహిళల కోసం రెండు క్యూ లైన్లు, సాధారణ ప్రజల కోసం మరో రెండు జనరల్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారికి ప్రత్యేకంగా రెండు మార్గాలను కేటాయించనున్నారు. వీఐపీలు వచ్చిన సమయంలో సాధారణ భక్తులను ఆపకుండా దర్శనం కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

వేడుకల భద్రత కోసం జులై 31 నుంచి 10 క్రైమ్ టీమ్స్ విధుల్లో ఉంటాయని డీసీపీ తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. జోగినిలకు ప్రత్యేక మార్గం, రంగం రోజున స్వర్ణలత కోసం ప్రత్యేక భద్రత కల్పిస్తామని ఆమె వివరించారు.

ఆగస్ట్ 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్ట్ 3న రంగం కార్యక్రమం జరగనున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.