హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ 'ఎట్ హోమ్' కార్యక్రమంలో చేర్యాలకు చెందిన నకాశీ చిత్రకళాకారుడు దనాలకోట రాకేశ్ ప్రదర్శించిన మాస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కళలోని ప్రత్యేకతలను, మాస్క్‌ల తయారీ పద్ధతులను రాకేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లాలకు వివరించారు.

రాకేశ్ తన తండ్రి, ప్రముఖ నకాశీ కళాకారుడు దనాలకోట వైకుంఠం వద్ద ఈ కళను నేర్చుకున్నారు. 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో వైకుంఠం ప్రతిభను, ఈ పురాతన కళను కాపాడుతున్న తీరును మెచ్చుకున్నారని రాకేశ్ గుర్తు చేశారు.

లోక్‌భవన్ దర్బార్ హాల్‌లో బతుకమ్మ, రామాయణం, కృష్ణలీలలు, గ్రామీణ మహిళల జీవనశైలి వంటి అంశాలతో రూపొందించిన నకాశీ చిత్రాలను అధికారులు ప్రదర్శించారు. తెలంగాణ జానపద కళా సంపదలో చేర్యాల నకాశీ చిత్రకళకు ఒక ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు ప్రత్యేక కార్యదర్శి ఎం.దానకిశోర్, సంయుక్త కార్యదర్శి శశీకరణాచారి పాల్గొన్నారు.