సంగారెడ్డి జిల్లాలో మెకానిక్‌గా పనిచేస్తున్న ఆరిఫుద్దీన్, తన మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. తోడు కోసం చూస్తున్న అతనికి హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక మహిళతో వివాహం నిశ్చయమైంది. అమ్మాయి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో, పెళ్లి ఖర్చుల కోసం ఆరిఫుద్దీన్ వారికి ₹60 వేల నగదును ఎదురుకట్నంగా ఇచ్చాడు.

పెద్దల సమక్షంలో వివాహం జరిపించుకుని ఆరిఫుద్దీన్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అయితే, పెళ్లయిన మరుసటి రోజే తన భార్య ఇంట్లో లేకపోవడాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. బంధువులను, తెలిసిన వారిని అడిగినా ఆమె ఆచూకీ తెలియలేదు. వధువు కుటుంబ సభ్యుల నుంచి కూడా సరైన సమాచారం అందకపోవడంతో, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన మోసమేమోనని ఆరిఫుద్దీన్ అనుమానిస్తున్నాడు.

ఈ ఘటనపై ఆరిఫుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వధువు అదృశ్యం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం వధువు కాల్ డేటా మరియు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.