రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉంచిన 22ఏ భూములను వెంటనే విడిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. పేదలు కష్టపడి కొనుక్కున్న కోటి ఎకరాల భూమిని ఈ జాబితాలో చేర్చి, ప్రభుత్వం వాటిని దోచుకోవడానికి సిద్ధమైందని ఆయన ఆరోపించారు.

ఈ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బండి సంజయ్ ప్రధానంగా ప్రశ్నించారు. దీనికి అసలు సూత్రధారి ఆయనేనని ఆయన ఆరోపించారు. భద్రాచలంలో బుధవారం జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు.

ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా, జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన ప్రశ్నించారు. వీరిలో ఒకరు ముఖ్యమంత్రికి కుడిభుజంగా, మరొకరు ఎడమభుజంగా ఉంటే, ఇంకొకరు ముఖ్యమంత్రి పదవిపైనే కన్నేశారని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనపై 109 కేసులు పెట్టినా, తాను భయపడలేదని ఆయన గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ అవినీతిని తామే బయటపెట్టామని, ఆ పార్టీని ఎదుర్కొన్నది బీజేపీనేనని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా బుధవారం బండి సంజయ్ తన కుటుంబంతో కలిసి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు.