Sajjanar | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేరుగా జోక్యం చేసుకోవడంపై వెంటనే విచారణ జరిపించాలని, అత్తాపూర్ పీఎస్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన కేసును సీబీసీఐడీకి అప్పగించాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా డీజీపీ సీవీ ఆనంద్‌కు 4 పేజీల లేఖను పంపినట్టు ఆదివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరుపొందిన సజ్జనార్.. ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా ఎన్‌కౌంటర్ చేస్తానంటూ కస్టోడియల్ విచారణలో బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయని ఆ లేఖలో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక ట్రైనీ ఐపీఎస్ కేసును సీపీ సజ్జనార్ ఎందుకంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో, నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామంటూ ఎందుకు బెదిరించారో తేలాలంటే వెంటనే ఆ కేసును సీఐడీకి బదిలీ చేయాలని డీజీపీని కోరారు.
ఈ కేసులోని ఫిర్యాదుదారు 2024 బ్యాచ్‌లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికై, మణిపూర్ క్యాడర్‌కు కేటాయించబడ్డారు. సర్వీస్ కేటాయింపును మెరుగుపరచుకోవడంలో భాగంగా ఆమె మళ్లీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు తన ప్రాథమిక శిక్షణను వాయిదా వేసుకున్నారు. ఈ కాలంలో ఆమెకు 2025 బ్యాచ్‌లో ఐపీఎస్‌గా ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డితో సోషల్ మీడియా పరిచయం ఏర్పడి వ్యక్తిగత, ప్రేమ సంబంధంగా మారింది. కానీ, అప్పటికే తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ను వివాహం చేసుకున్న ఆమె మణిపూర్ నుంచి తమిళనాడుకు బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ అంశం నేటికీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఉదయ్ కృష్ణారెడ్డి క్యాడర్ కేటాయింపు ఇంకా పెండింగ్‌లో ఉన్నది. ఆయనను ఏ రాష్ట్ర క్యాడర్‌కు కేటాయిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఉదయ్ కృష్ణారెడ్డితో బాధితురాలికున్న సంబంధం ఆమె భర్త దృష్టికి రావడంతో ఆ సంబంధాన్ని పరస్పర అంగీకారం లేనిదిగా చిత్రీకరించినట్టు తెలుస్తున్నది. లైంగిక వేధింపులకు గురయ్యానంటూ బాధితురాలు తొలుత ఎన్‌పీఏ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీని పర్యవసానంగా పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చి, అరెస్టు చేశారు.
పోష్ చట్టం కింద అంతర్గత విచారణ పూర్తి కాకముందే పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన తీరు అత్యంత ఆందోళన కలిగిస్తున్నది. ఉదయ్ కృష్ణారెడ్డితో బాధితురాకి ఉన్న సంబంధ స్వభావం, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికి దారితీసిన పరిస్థితులు సహా అన్ని అంశాలను నిష్పాక్షికంగా పరిశీలించడానికి బదులుగా నిందితుడిపై పోలీసులు అనవసరమైన వేగంతో చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయడం నిజంగా అవసరమా? కాదా? అరెస్టుకు సంబంధించిన నిబంధనలను పోలీసులు పాటించారా? లేదా? అనే విషయాలను పరిశీలించడం సమంజసంగా ఉంటుంది. విచారణకు నిందితుడు సహకరించకపోవడం, ఆధారాలను నాశనం చేయడం, మరిన్ని నేరాలకు పాల్పడటం, సాక్షులను ప్రభావితం చేయడం, పరారవడం లాంటివేమీ లేకపోయినా ఆయనను ముందుస్తుగానే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తున్నది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉన్నది.
బాధితురాలు తొలుత ఎన్‌పీఏ డైరెక్టర్‌కు, అనంతరం అత్తాపూర్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తనపై అత్యాచారం, హత్యాయత్నం జరిగినట్టు ఆరోపించలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో తీవ్రమైన ఆరోపణలు పొందుపర్చారు. ఇవి నిందితుడి స్వేచ్ఛ, బెయిల్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలను ఏ పరిస్థితుల్లో చేర్చారో జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా ప్రతి ఆరోపణ మొదట ఎప్పుడు చేయబడిందో, ఏ ఆధారాల ఆధారంగా నిందితుడిపై అదనపు సెక్షన్లు చేర్చారో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉన్నది.
నా బ్యాచ్‌మేట్ వినయ్ రంజన్‌రే భార్య కొన్ని నెలల క్రితం ప్రశాసన్‌నగర్‌లోని వారి నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో ప్రధాన నిందితుతులను హైదరాబాద్ పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు విచారణకు ఇవ్వని ప్రాధాన్యత, అత్యవసరాన్ని ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సజ్జనార్ ఎందుకు ఇస్తున్నారని అడగడం సమంజసమే. ఈ కేసులో ఫిర్యాదుదారైన అధికారిణి కర్ణాటకకు చెందినవారు. అది సజ్జనార్ సొంత రాష్ట్రం. ఈ ఒక కారణంతోనే వారి మధ్య అనుచిత సంబంధం ఉన్నదని నేను చెప్పడం లేదు. కానీ, ఈ కేసు పట్ల సజ్జనార్ అసాధారణ ఆసక్తి చూపడం అనుమానాలను రేపుతున్నది. చట్టానికి లోబడి నిష్పాక్షికంగా దర్యాప్తు జరపడం, ఆధారాలు సేకరించడం, వాటిని న్యాయస్థానం ముందు ఉంచడమే పోలీసుల ప్రాథమిక విధి. నేరాన్ని నిర్ధారించి, శిక్ష వేయడం న్యాయవ్యవస్థ పని.
కస్టోడియల్ విచారణ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై మీడియాలో వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయని నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. కస్టడీలో పోలీసులు తనను అమానుషంగా చిత్రహింసలకు గురిచేశారని, సీసీటీవీ కెమెరాలు లేని ప్రదేశాల్లో విచారించారని నిందితుడు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు విలపించినట్టు తెలుస్తున్నది. కస్టోడియల్ విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డిని సజ్జనార్ ప్రశ్నించడంతోపాటు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తానంటూ బెదిరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎంతో తీవ్రమైన ఈ ఆరోపణల్లో నిజాలను నిగ్గుతేల్చాలి. అందుకు స్వతంత్ర విచారణ జరిపించాలి. విఫలమైన ఓ వ్యక్తిగత సంబంధం నుండి పుట్టుకొచ్చిన ఈ కేసులో నిందితుడైన ఐపీఎస్ ప్రొబేషనర్‌ను సీపీగా అత్యున్నత స్థాయిలో ఉన్న సజ్జనార్ స్వయంగా విచారించడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసుపై సజ్జనార్ ఎందుకు అసాధారణ ఆసక్తి చూపుతున్నారన్న ప్రశ్న వ్యక్తమవుతున్నది. నా అవగాహన ప్రకారం సజ్జనార్ ఈ కేసు పర్యవేక్షణాధికారి కాదు. కానీ, కమాండ్ చైన్‌లో ఉన్నతాధికారిగా ఈ కేసు పురోగతిని సమీక్షించే అధికారం, బాధ్యత ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన నిందితుడిని విచారించి బెదిరించారన్న ఆరోపణల్లో నిజం నిగ్గుతేలాలి.








