స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రాంతీయ భాషా కంటెంట్‌ను చూసేందుకు వీలుగా వొడాఫోన్ ఐడియా (Vi) కొత్తగా రూ. 35 యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ప్రధానంగా వినోద ప్రియుల కోసం రూపొందించిన ఈ ప్లాన్‌లో 1GB డేటా లభిస్తుంది.

ఈ ప్లాన్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మీకు నచ్చిన 6 ప్రాంతీయ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లలో ఏవైనా 2 ప్లాట్‌ఫామ్‌లను 28 రోజుల పాటు ఉపయోగించుకునే అవకాశం దక్కుతుంది. అయితే, ఈ ప్లాన్‌లోని డేటా వ్యాలిడిటీ మాత్రం 7 రోజులు మాత్రమే ఉంటుంది.

ఈ సదుపాయాన్ని పొందడానికి ముందుగా మీ నంబర్‌ను రూ. 35తో రీఛార్జ్ చేసుకోవాలి. ఆ తర్వాత Vi మొబైల్ లేదా టీవీ యాప్‌ను ఓపెన్ చేసి, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి జాబితా నుంచి మీకు నచ్చిన రెండు ఓటీటీలను ఎంచుకోవచ్చు.

ఇది కేవలం యాడ్-ఆన్ ప్యాక్ మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఈ సదుపాయాన్ని వాడుకోవడానికి మీ ఫోన్‌లో ముందుగానే వ్యాలిడిటీ ఉండే మరో ప్రధాన రీఛార్జ్ ప్లాన్ ఉండాలి. కేవలం రూ. 35తో రీఛార్జ్ చేయడం వల్ల ప్రధాన సర్వీసు వ్యాలిడిటీ పెరగదు.

మరోవైపు, టెలికాం నియంత్రణ సంస్థ TRAI మార్గదర్శకాలను అనుసరించి Vi సంస్థ వాయిస్-మాత్రమే లభించే అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. మొబైల్ డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్ కోసం రీఛార్జ్ చేసుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌లను తీసుకువచ్చారు.