రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్లోనే అత్యంత భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. రెగ్యులర్ మాస్ హీరో పాత్రలకు భిన్నంగా, భావోద్వేగాలతో కూడిన పాత్రను ఆయన పోషిస్తున్నారు.
ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్గా కట్టిపడేస్తాయని సమాచారం. ఇందులో రవితేజ కుమార్తెగా బేబీ నకాస్త్ర నటిస్తోంది. అయ్యప్ప దీక్ష, ఇరుముడి సంప్రదాయం, ఆధ్యాత్మికతకు సంబంధించిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
దర్శకుడు శివ నిర్వాణ కుటుంబ భావోద్వేగాలను చక్కగా తెరపై ఆవిష్కరించగలరు. భక్తి, కుటుంబ అనుబంధాలు, యాక్షన్ కలగలిపి రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఈ చిత్రాన్ని 'ఇరుముడికట్టు' పేరుతో విడుదల చేయనున్నారు.







